Advertisement
Google Ads BL

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభ


తెలుగు చిత్ర పరిశ్రమలో యాస, భాష, తెలంగాణ అన్న స్పృహ వదులుకుంటే తప్ప తెలంగాణ సినీ కళాకారులకు అవకాశాలు రావటం లేదు. తెలంగాణ పేరు చెబితే పరిశ్రమలో కళాకారులకు స్ధానంలేని పరిస్ధితి నెలకొంది. ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రాంతం ఆధారంగా కళాకారులకు అవకాశాల్ని ఇవ్వటం చాలా అన్యాయం’ అని అన్నారు తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ కోదండరాం. తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఎసి ఛైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ.. ‘ఆలస్యమైనా అవసరాలకు తగినట్లుగా మనకంటూ తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పడటం ఆనందదాయకం. తెలంగాణలో పుట్టడమే అనర్హతగా భావిస్తున్న తరుణంలో ఆ వివక్షను ఎదిరించడానికి, మార్చటానికి ఈ అసోసియేషన్‌ ప్రారంభమైంది. మా తెలంగాణ మాకు శాపం కాకూడదు, ప్రాంతీ భేదాల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా కళాకారులకు అవకాశాల్ని ఇవ్వాలనే ఆకాంక్ష, సంకల్పమే దీని ఏర్పాటుకు మూల కారణమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, అస్తిత్వంతో పాటు మొత్తం సాంస్కృతిక జీవనాన్ని వ్యాప్తిచేసే సినిమాలు రావాలి. అలాంటి సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ‘మాభూమి’, ‘చిల్లరదేవుళ్లు’ లాంటి కొన్ని చిత్రాలు వచ్చినా ఆ సంస్కృతి కొనసాగించలేకపోయాం. తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టుతో కూడిన మరిన్ని సినిమాలు రావాలి. అది ఒక్క తెలంగాణ కళాకారుల వల్లనే సాధ్యమవుతుంది. ఆంధ్ర ప్రాంత చరిత్రను అద్భుతంగా చిత్రీకరించినందుకు సామాజిక శాస్త్రవేత్తగా సంతోషపడుతున్నాను. అదే తరహాలోనే తెలంగాణ చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నాలు చేయాలి. ప్రతిభతోనే అవకాశాల్ని అందిపుచ్చుకోగలననే ఆత్మవిశ్వాసం తెలంగాణ సినీ కళాకారుల్లో రావాలి. పైడి జయరాజ్‌, కాంతారావు లాంటి గొప్ప తెలంగాణ నటీనటులు వారసత్వాన్ని, స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలి. సినిమా రంగం సంక్షోభంలో పడటానికి గుత్తాధిపత్యమే ప్రధాన కారణం. లాభాల కోసం చిత్ర నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ పోవటంతో చిన్న నిర్మాతలు సినిమాలు నిర్మించలేని పరిస్ధితులు దాపురించాయి. థియేటర్లను కబ్జాలుచేసి, కొంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ డబ్బు గడిరచాలని ప్రయత్నాలు చేయటంతో నిర్మాతలు నష్టపోతున్నారు. ఈ పరిసితిలో మార్పు రావాలి. నైపుణ్యాన్ని ప్రదర్శించే వారే సినిమాలు తీయాలి. గుత్తాధిపత్యం రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రకటనలు రావాలి. తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు తీసే కళాకారులను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి. మంచి మనిషిగా ఎదగడానికి, నిలబడడానికి ఉపకరించే నైతిక విలువలతో కూడిన చక్కటి సినిమాలు రావాలి. అలాంటి సినిమాల్ని తెలంగాణ కళాకారులు భవిష్యత్‌లో రూపొందించాలి. ఆంధ్ర ప్రజల పట్ల తెలంగాణ కళాకారుల్లో చిన్నచూపు ఉండకూడదు. వారి చరిత్ర ఘనమైనది. దానిని తప్పు పట్టకూడదు. అదే స్థాయిలో నా చరిత్ర గొప్పదనే స్పృహ ఇక్కడి కళాకారుల్లో రావాలి. దానిని కాపాడుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చిన్న నిర్మాతలను మేము కోరేది ఒకటే. చిన్న సినిమాల్ని బతికించి, గుత్తాధిపత్యంపై చేయి చేయి కలిపి పోరాటం చేద్దాం. సినిమా రంగాన్ని కాపాడుకుందాం’ అన్నారు.

Advertisement
CJ Advs

రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ... ‘భవిష్యత్‌లో తెలంగాణ కళాకారులు, దర్శకులు, నిర్మాతలు చక్రం తిప్పే రోజు తప్పకుండా వస్తుంది. రావాలి. తెలంగాణ కళాకారులు, రచయితలు అందరూ సంఘటితమై తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేయాలి’ అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణలో వందకు పైగా థియేటర్లలో ఆడే సినిమాలకు టాక్స్‌ అనేదే లేకుండా చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేశాం. అయితే ఈ సినిమాల్లో  తెలంగాణ కళాకారులు 70 శాతానికి పైగా ఉంటేనే ఈ రాయితీ వర్తించేలా ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వ ప్రకటన అమలైన పక్షంలో తెలంగాణ కళాకారులందరికీ ఉపాధి తప్పకుండా దొరుకుతుంది’ అన్నారు.

రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘మూకీ సినిమాల కాలంలో సినిమా రంగం మొగ్గ తొడుగుతున్న దశలోనే నిజాం కాలంలో  ధీరేన్‌ గంగూళీ లండన్‌ నుంచి సినిమాల్ని దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. 1920లోనే హైదరాబాద్‌ సినిమాలకు హబ్‌గా మారింది. కానీ కొన్ని కుట్రల వల్ల తెలంగాణ సినిమా చంపబడిరది. తెలంగాణ అస్ధిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే మరిన్ని మంచి సినిమాలు రావాలి’ అన్నారు.

సినిమా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంగకుమార్‌ మాట్లాడుతూ వివక్షపూరిత చర్యలను విడనాడి తెలంగాణ కళాకారులను ఆదరించి అవకాశాలివ్వాలన్నారు.

తెలంగాణ నిర్మాతల సంఘం అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌, తెలంగాణ విద్యా వేదిక కార్యదర్శి గురజాల రవీందర్‌, సంపత్‌కుమార్‌, సంగిశెట్టి దశరథ, మహ్మద్‌ ఖాసిం, మానిక్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs