ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తెలుగు సినీ హీరోయిన్ నీతూ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నాయకుడు మస్తాన్ వలీని ఏప్రిల్ 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు నీతూ అగర్వాల్ బ్యాంక్ ఖాతానుంచి స్మగ్లర్ల ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గురించారు. ఇక తీగలాగితే డొంకంతా కదిలింది. గతంలో నీతూ అగర్వాల్ నటించిన 'ప్రేమ ప్రయాణం' చిత్రాన్ని వలీని ప్రొడ్యూస్ చేశారు. అప్పటినుంచి వీరిమధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి చెల్లింపులు, తదితర విషయాల్లో నీతూను వలీ వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఈ విషయాన్ని కనిపెట్టిన పోలీసులు రెండురోజులుగా నీతూ గురించి వెతుకుతున్నారు. ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు ఆమెను కర్నూల్ జిల్లా నంద్యాల జైలుకు తరలించారు. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి మరింతమంది వీఐపీల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.