తెలుగు సినిమా కథలన్నీ ఒకే చట్రం చుట్టూ తిరుగుతున్నాయనేది కాదనలేని సత్యం. విమర్శకులే కాదు... దర్శకులు కూడా ఈ మాటని అంగీకరిస్తున్నారు. సాక్షాత్తు దర్శకుడు తేజనే సినిమా కథలపై ఓ సెటైర్ వేశాడు. ఆయన మాట్లాడుతూ... మన దగ్గర రెండే కథలున్నాయి. వాటినే తిప్పి తిప్పి చూపిస్తున్నాం. హీరో ఓ ఊర్లో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బుద్దిమంతుడిలా బతికేస్తుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో మనోడు పెద్దతోపుగాడని, రాయలసీమలో పెద్ద పోటుగాడని తెలుస్తుంది. రెండో కథ... ఏమిటంటే హీరో విలన్ ఇంట్లో తిష్ఠ వేస్తాడు. వాడి కూతుర్ని ప్రేమిస్తాడు. ఇంటర్వెల్‌లో ఓ ట్విస్ట్. హీరోకి, విలన్‌కు పాత గొడవలుంటాయి. అందేంటనేది సెకండాఫ్‌లో చూపిస్తారు. ఇలాంటి కథలు తప్ప మనం కొత్తవి రాసుకోం. చిన్న సినిమాల్లోనే కొత్త కథలుంటాయి. వాటిని మనం పట్టించుకోము... అంటూ తెలుగు సినిమాపై తనదైన రీతిలో సెటైర్లు వేశాడు.