ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డిపేరిట ఏర్పాటు చేసిన బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని 2014కు గాను ‘రేసుగుర్రం’ చిత్రానికి అందించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ దంపతులు, గొల్లపూడి మారుతీరావు, రావు బాలసరస్వతీదేవి, సింగీతం శ్రీనివాసరావు, ‘రేసుగుర్రం’ నిర్మాతలు డా॥ వెంకటేశ్వరరావు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), దర్శకుడు సురేందర్‌రెడ్డి, బి. నాగిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ‘రేసుగుర్రం’ చిత్ర నిర్మాతలు బి.నాగిరెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.
అనంతరం కృష్ణ మాట్లాడుతూ... ‘నాకు ఊహ తెలిశాక చూసిన సినిమా ‘పాతాళభైరవి’. ఆ సినిమానచ్చి అనేకసార్లు చూశాను. ఆ తర్వాతనుంచి చక్రపాణి, నాగిరెడ్డిగారి కలయికలో వచ్చిన ప్రతి సినిమాను 30, 40సార్లు చూసేవాడ్ని. మరో వందేళ్ల వరకు కూడా వారి చిత్రాలను మరువలేము. నా సినిమాలన్నీ కూడా బి.నాగిరెడ్డిగారి స్టూడియోలోనే 90 శాతం షూటింగ్ జరుపుకున్నాయి. నేనెంతో ఇష్టపడి తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం కూడా వారి స్టూడియోలో వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. నేను చేసిన తొలి సినిమా ‘పాతాళభైరవి’ కూడా ఇక్కడే ప్రారంభమైంది. అదేచోట ప్రారంభం అవుతున్న ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం కూడా ‘పాతాళభైరవి’ అంత పేరు తెచ్చుకుంటుందని నాగిరెడ్డిగారు దీవించారు. అలాగే నా చిత్రం ఘన విజయం సాధించింది. ‘గంగ మంగ’, ‘రాజేశ్వరి కాఫీవిలాస్ క్లబ్’ చిత్రాల్లో నటించాను. అలాంటి గొప్ప నిర్మాత పేరిట వెలసిన పురస్కారాన్ని అందుకుంటున్న ‘రేసుగుర్రం’ టీమ్‌ని అభినందిస్తున్నాను’ అన్నారు.
గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ... ‘వ్యాపార ధోరణితో కాకుండా అభిరుచి గల చిత్రాలను నిర్మించి గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బి.ఎన్.రెడ్డిగారు. ఈ 70, 80 ఏళ్లలో ఎవరూ కూడా ఆయనలా అభిరుచి గల చిత్రాలను తీసిన వారెవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ భాషలన్నింటిలో చిత్రాలను నిర్మించిన వైతాళికుడు. 12 భాషల్లో చందమామ పుస్తకాన్ని నడిపించారు. ఇలాంటి గొప్ప నిర్మాతపేరిట వెలిసిన ఈ అవార్డును ‘రేసుగుర్రం’ చిత్రానికి సంబంధించిన వారందరికీ నా శుభాకాంక్షలు. నిర్మాతకు స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డును ప్రారంభించిన నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు నా అభినందనలు’ అన్నారు.
‘రేసుగుర్రం’ దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి గారి పురస్కారం మా చిత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలన్నీ వారు నిర్మించినవే. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన ఈ పరిశ్రమలో నేనూ వుండడం గర్వకారణంగా భావిస్తున్నాను’ అన్నారు.
గాయని రావు బాలసరస్వతీదేవి మాట్లాడుతూ... ‘ఒకరోజు బి.నాగిరెడ్డిగారు తను నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘షావుకారు’ కోసం ఓ పాట పాడమని వచ్చారు. అప్పటికే పాడడం మానేసిన నేను ఆయన పట్టుదల చూసి కాదనలేకపోయాను. మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన పేరిట వెలసిన ఈ అవార్డు అందుకుంటున్న ‘రేసుగుర్రం’ యూనిట్‌కు నా శుభాకాంక్షలు’ అన్నారు.
విజయనిర్మల మాట్లాడుతూ... ‘మానాన్నగారు వాహినీ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేయడంతో చిన్నప్పటి నుంచి బి.నాగిరెడ్డి గారితో అనుబంధం ఏర్పడిరది. ప్రతి పనిలో ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉండేవారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ‘షావుకారు’ చిత్రంలో నేను హీరోయిన్‌గా నటించాను. మాట ఇస్తే కట్టుబడి వుండే మనిషి. ఈ చిత్రానికి ఎంతోమంది ఆర్టిస్టులను మార్చినా నన్ను మాత్రం మార్చలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బి.నాగిరెడ్డిలాంటి నిర్మాతలు లేరనే చెప్పాలి. ఇప్పుడు నిర్మాతలంతా ప్రొడక్షన్ మేనేజర్లలా మారారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఎంతో గౌరవించే వారు. ఆయన్ను చూసినప్పుడల్లా మా నాన్నగారిని చూసినట్లే ఉండేది’ అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన డా॥ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘ఎన్నో సేవా సంస్థలు ఏర్పాటుచేసి ఎంతో మందికి సేవ చేసిన గొప్ప వ్యక్తి నిర్మాత బి.ఎన్. రెడ్డిగారు. అలాంటి గొప్ప నిర్మాత పేరిట వెలసిన ఈ అవార్డు మా చిత్రానికి రావడం చాలా ఆనందంగా వుంది. బహుమతిగా అందుకున్న రూ. 1.50 లక్షలను విజయా ట్రస్ట్‌కు అందజేస్తున్నాం’ అన్నారు.