టాలీవుడ్‌లో డైరెక్టర్ తేజ ఓ సంచలనం. అత్యంత తక్కువ బడ్జెట్‌తో 'చిత్రం' సినిమా తీసి బ్లాక్‌బాస్టర్ హిట్‌నిచ్చిన తేజ ఇండస్ట్రీలో ఓ కొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నువ్వు-నేను, జయంలాంటి హిట్లను ఇచ్చిన తేజనుంచి ఆ తర్వాత భారీ విజయానందుకున్న సినిమాలు కరువయ్యాయి. అయినప్పటికీ మూస ధోరణికి విభిన్నంగానే చిత్రాలు చేయడానికి తేజ ప్రయత్నాలు కొనసాగించారు. ఇక తాజాగా 'హోరాహోరీ' చిత్రంలో కేవలం తెలంగాణ నటులనే మాత్రమే తీసుకున్నట్లు తేజ ప్రకటించి ఇండస్ట్రీలో కొత్తవాదనకు తెరతీశారు. ఇప్పటికే తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా వేరుపడినప్పటికీ టాలీవుడ్‌కు సంబంధించి మాత్రం చిన్నచిన్న విభేదాలు కొనసాగుతున్నప్పటికీ కలిసే ముందుకు నడుస్తున్నారు. అయితే తేజ ప్రకటన ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేవలం తెలంగాణ నటీనటులేనే తన చిత్రంలో తీసుకుంటాన్న తేజ ప్రకటనపై ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీఈఈఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు తమ సంస్థలోని 14 వేల మంది కళాకారులనుంచి ఎలాంటి సహకారం ఉండదని, తేజను తమ సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ సంస్థకు సంబంధించి 24 ఫ్రేమ్స్‌లోని సభ్యులందరూ తేజ సినిమాకు ఎలాంటి సహకారం అందించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వార్తను తేజ చాలా లైట్‌గా తీసుకున్నాడు. కొత్త రాష్ట్రంలో ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఆ ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు. అయినా ఏపీఈఈఎప్ ప్రకటన తనపై ఎలాంటి ప్రభావం చూపదని, అనుకున్నట్టే మేలోనే తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని తేజ ప్రకటించారు. మరి తేజ సాహసాన్ని చూసి కేసీఆర్ ఏ విధంగా ప్రోత్సహిస్తారో వేచిచూడాల్సిందే.