నిర్మాతల మండలిని, చిన్న సినిమాలను కొందరు నాశనం చేస్తున్నారని నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నట్టికుమార్ మాట్లాడుతూ "చిత్ర పరిశ్రమలో ఎందఱో నిర్మాతలుండగా వారందరినీ పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చిన 14 మంది నిర్మాతలు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. వారి చెప్పినట్లుగా వినాలని మిగిలిన వారిపై వత్తిడి చేస్తున్నారు. ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న ఆ 14 మందిని నిర్మాతల మండలి నుండి బహిష్కరించాలి. నిర్మాతల మండలి 14 మందికి చెందినది కాదు 1400 వందల మందికి చెందినది. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోసం వారేం చేసారు. ఆ 14 మందిలో రామానాయుడు గారి తనయుడు, అల్లు అరవింద్ గారు ఉండడం చాలా బాధాకరం.16 కోట్ల నిధి ఉన్న నిర్మాతల మండలి నుండి 5 కోట్లను కాజేశారు. అంతే కాకుండా ఏదొక విధంగా మిగిలిన 11 కోట్లను కూడా ఖర్చుపెట్టి నిర్మాతల మండలిని రోడ్డేక్కించాలనుకుంటున్నారు. మాకు ఆరు మాసాల సమయం ఇస్తే ఆ 16 కోట్లను 32 కోట్లుగా చేస్తాం. డబ్బు కాజేయడమే కాకుండా మీడియా వారికి కూడా అన్యాయం చేస్తున్నారు. రెండు ఛానళ్ళకు మాత్రమే పరిశ్రమను కట్టబెట్టి కంటెంటును అమ్ముకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 14 మంది కంపనీ పెట్టి ప్రమోషన్ ను కూడా తమ స్వలాభం కోసం వ్యాపారంగా మార్చనున్నారు. చిన్న నిర్మాతలకు అండగా ఉంటామని దాసరి గారు తన మద్దతు తెలిపారు" అని చెప్పారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ "ఈరోజు చిత్ర పరిశ్రమ ఈ విధంగా అయినా ఉందంటే దానికి కారణం ఎన్.టి.రామారావు గారు. వారు నిర్మాతలు ఇబ్బంది పడకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కాని ఇప్పుడు అలా ఎవరు లేరు. ఇండస్ట్రీని పాలించాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఎన్నో అవకతవకలు చేస్తున్నారు. చిత్రపురి ఎంటర్ టైన్మెంట్ కోసం 75 లక్షలు వృధా చేసారు. మెడికల్ క్లెయిమ్ విషయంలో ఎన్నో కుట్రలు చేసారు" అని తెలిపారు.