పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో 'అత్తారింటికి దారేది' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అనూహ్య పరిణామాల నడుమ విడుదలైన అత్తారిల్లు వసూళ్ళ పరంగా రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభకు పవన్ కళ్యాణ్ ఇమేజ్, సినిమా లీకవడం వలన ప్రేక్షకులలో కొంత సానుభూతి వ్యక్తమవడం.. ఇండస్ట్రీ హిట్ వసూళ్లు రావడానికి కారణమయ్యాయి. 'అత్తారింటికి దారేది' తర్వాత స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రతిసారి రికార్డుల విషయం తెరపైకి వస్తుంది. భారి అంచనాల నడుమ విడుదలైన మహేష్ బాబు '1 నేనొక్కడినే', 'ఆగడు'.. రామ్ చరణ్ 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే'.. సినిమాలు 'అత్తారిల్లు' రికార్డులను తిరిగరాస్తాయని ట్రేడ్ పండితులు ఆశించారు. అది సాధ్యపడలేదు.
'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలకు ముందు మరోసారి రికార్డుల గోల బయటకొచ్చింది. 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా కావడం, విడుదలకు ముందు భారి స్థాయిలో బిజినెస్ జరగడం, ఏడాదిన్నర కాలంలో తెలుగు సినిమా మార్కెట్ కొంచం పెరగడంతో 'సన్నాఫ్ సత్యమూర్తి' పవన్ రికార్డులను బ్రేక్ చేస్తుందేమో అని అంతా ఎదురుచూశారు. విడుదల తర్వాత సత్యమూర్తితో 'అత్తారింటికి దారేది' రికార్డులకు వచ్చిన ముప్పేమీ లేదని అర్ధమయింది. భారి ఓపెనింగ్స్ సాధించడంతో తొలివారంలో రికార్డులు ఏవైనా నమోదు చేసే అవకాశం ఉందని కొందరు అన్నారు. అది కూడా జగగలేదు. మిగతా సినిమాలకు అందనంత ఎత్తులో 'అత్తారింటికి దారేది' రికార్డులు పదిలంగా ఉన్నాయి. వీటిని ఎ సినిమా బ్రేక్ చేస్తుందోనని మీడియా, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతానికి 'అత్తారిల్లు' రికార్డులు సేఫ్.
Advertisement
CJ Advs