అదృష్టమంటే ఇదేనంటూ పాట పాడుకుంటున్నాడు నటుడు శీవాజిరాజా. 'మా' ప్రధాన కార్యదర్శిగా పోటీచేసి గెలుపొందిన ఆయన ఇప్పుడు తన విజయాన్ని తానే నమ్మలేకపోతున్నాడు. మొదట రాజేంద్రప్రసాద్ వర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన చివరిక్షణంలో ఎన్నికలనుంచి తప్పుకోవాలని చూశారు. అయితే అప్పటికే నామినేషన్ విత్‌డ్రా చేసుకునే గడువు ముగిసిపోవడంతో అయిష్టంగానే ఆయన ఎన్నికల్లో పోటీచేశారు. అంతేకాకుండా తన ప్రత్యర్థిగా పోటీచేస్తున్న ఆలీకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరడం సినీవర్గాలను కూడా విస్మయపరిచింది. జయసుధ ప్యానెల్ విజయం ఖాయం కావడంతోనే శివాజిరాజా నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడానికి చూశాడన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఎన్నికలకు ఒక్క రోజు ముందు నటి హేమ, శివాజిరాజాల మధ్య కొనసాగిన వివాదం అటు మీడియాను ఇటు సినీ ఇండస్ట్రీని కూడా బాగా ఆకర్షించింది. ఇక ఎన్నికలు ముగిసిన ఇన్ని రోజుల తర్వాత వెలువడిన 'మా' ఎన్నికల ఫలితాల్లో తాను గెలవడాన్ని చూసి శివాజిరాజా ఇప్పుడు పట్టలేని ఆనందంలో ఉన్నాడు. మరి అదృష్టమంటే శివాజిదే కదా..!