'మా' ఎన్నికల ఫలితాల వెల్లడికి గ్రహణం వీడటం లేదు. నటుడు కల్యాణ్ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ 'మా' ఎన్నికల ఫలితాలను వెల్లడించవచ్చని సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తాయని అందరూ ఆశించారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా కల్యాణ్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 'మా' ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఇదివరకే కోర్టు సమయం వృథా చేశాడంటూ కల్యాణ్‌కు సివిల్ కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. అయినా ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదు. ఇక హైకోర్టులో ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు 'మా' ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం కష్టమే. ఈ పరిణామంపై టాలీవుడ్ వర్గాలు మళ్లీ నిరాశకు లోనయ్యాయి. ఈసారి కూడా సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పే రిపీట్ అవుతుందని, అంతేకాకుండా ఈసారి కల్యాణ్‌కు జరిమానా కూడా భారీగా విధిస్తారని జయసుధ వర్గం నాయకులు విమర్శిస్తున్నారు.