సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిజం ఉన్న కథతో వినోదాత్మక సినిమా తీయాలని ఉంది. అందుకోసం కథ సిద్దం చేస్తున్నానని అన్నారు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. బాపట్లలో కోన ప్రభాకరరావు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాటక పోటిలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హరీష్ శంకర్ మీడియాతో సినిమాల గురించి మాట్లాడారు. కోన వెంకట్, రవితేజల ప్రోత్సాహంతో దర్శకుడిగా ఎదిగానని చెప్పారు.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజలతో సినిమాలు చేసిన హరీష్ శంకర్, మహేష్ బాబుతో సినిమా చేయాలనే కోరిక వ్యక్తం చేశారు. స్టార్ దర్శకుడిగా హోదా కల్పించిన పవన్ కళ్యాణ్, దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రవితేజల కోసం రెండేసి కథలు సిద్దం చేసినట్టు హరీష్ శంకర్ తెలిపారు. మధ్యలో మహేష్ బాబు కోసం కథ రెడీ చేస్తున్నారు. వరుసగా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి స్కెచ్ గీసారు. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా దిల్ రాజు నిర్మిస్తున్న 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.