సంచలనాలకు మారుపేరు రామ్‌గోపాల్‌వర్మ. తన కెరియర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను ఆయన రూపొందించాడు. ఇటీవలి కాలంలో ఈ ప్రయోగాలు ఇంకా వేగం పుంజుకున్నాయి. ఫలితాల విషయాన్ని పక్కనపెడితే వర్మ చేసే ఆలోచనలు వినూత్నంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇప్పుడు ఆయన మరో కొత్త ప్రయోగానికి కూడా తెరలేపారు. తొలిసారిగా ఆయన ఓ మూకీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్, కామెడీ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రానికి 'సైలెంట్' అనే పేరును నిర్ణయించారు. సింగీతం శ్రీనివాసరావు 'పుష్పకవిమానం' సినిమా తీసిన తర్వాత వస్తున్న మూకీ సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో మాటలు ఉండవు కాబట్టి అన్ని భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తానని వర్మ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఆయన ప్రయోగాత్మకంగా తీసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాల బాట పట్టాయి.
వర్మ ఓ హిట్ సినిమా తీయక దాదాపు దశాబ్దం గడిచింది. సర్కారు తర్వాత వర్మ నుంచి చెప్పుకోదగ్గ సినిమానే రాలేదు. 'రక్త చరిత్ర' మొదటిభాగం తెలుగులో పర్వాలేదు అనిపించినా మిగితా భాషల్లో మాత్రం నిరాశ పరిచింది. మరి ఈ తరుణంలో కనీసం 'సైలెంట్' అయినా ఆయనకు విజయాన్ని దక్కిస్తుందో లేదో చూడాలి.