అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితగాథతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకనిర్మాత. హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడి పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర గీతాల్ని ఈ నెల 21న విశాఖపట్టణంలో, 22న వరంగల్‌లో రెండు వేదికలపై విడుదల చేశారు. అయితే ఈ చిత్రాన్ని 13వ శతాబ్దపు కాలమాన పరిస్థితులకు దర్పణంలా తీర్చిదిద్దామని దర్శకుడు గుణశేఖర్ చెబుతూ వస్తున్నాడు. కాగా ఈ చిత్ర ఆడియో వేడుక కూడా అలాగే నిర్వహించారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మీడియాతో ఏ మాత్రం సంబంధం లేకుండా 13వ శతాబ్దంలో ప్రచారమాధ్యమాలు లేని రోజుల్లో ఆడియో వేడుక నిర్వహిస్తే ఎలా వుంటుందో అచ్చం అలాగే మీడియాను పట్టించుకోకుండా ‘రుద్రమదేవి’ ఆడియోను జరిపారని అంటున్నారు సినీ జనాలు.శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది.. క్షణాల్లో సమాచారాన్ని ఎక్కడికైనా చేరవేసే సాంకేతికత వుండి కూడా ‘రుద్రమదేవి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్ర ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, న్యూస్‌ఐటమ్ వెబ్‌సైట్స్.. ఇతర మీడియాకు చేరడానికి రెండు రోజుల సమయం పట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.