పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో గందరగోళానికి తెరతీస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే మాటలు మారుస్తూ ఎవరికీ అంతుచిక్కకుండా అభిమానులను, పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటిస్తున్న పవన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట మాట్లాడుతున్నారు. రాజధాని నిర్మాణానికి అంతపెద్ద మొత్తంలో భూమి అవసరం లేదని పవన్ చెబుతున్నారు. అదే సమయంలో స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న వారి గురించి తనకెలాంటి ఇబ్బంది లేదని, బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. మరి అంతపెద్ద మొత్తంలో భూమి అవసరంలేనప్పుడు.. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినా.. బలవంతంగా ఇచ్చినా పవన్ వ్యతిరేకించాల్సి ఉంటుందనే వాదనలు వినబడుతున్నాయి. అంతేకాకుండా అవినీతి పెనవేసుకున్న మన దేశంలో అంతపెద్ద రాజధాని నిర్మించడం సాధ్యమా అంటూ ప్రశ్నిస్తూనే.. చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందంటూ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించారు. ఇక దీనికితోడు బాబు సమర్థుడైన నాయకుడంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెబుతున్నాడు. ఇలా పవన్ ఓసారి రైతులకు మద్దతుగా.. మరోసారి చంద్రబాబు మద్దతుగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం అందర్ని అయోమయంలోకి నెడుతోంది.