టాలీవుడ్ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఎంతో కాలం ఏలారు. అయితే వారి వయసు మీద పడటం.. ఇతర యంగ్‌స్టార్స్ దూసుకురావడంతో సీనియర్ పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం.. ఇప్పటికీ తన 150వ చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన ఇమేజ్ నేడు ఎలా ఉంది? ఆయన స్టామినా ఎంత? అనేవి లెక్క వేయడం కష్టం. ఆయన నటించిన 150వ చిత్రం విడుదలైతే తప్ప చిరు ఇమేజ్‌ను, స్టామినాను లెక్కవేయలేం. ఇక నాగార్జున, వెంకటేష్‌లు ప్రస్తుతం ఏటికి ఎదురీదుతున్నారు. వీరి చిత్రాలు 20కోట్లు వసూలు చేస్తే అదే పెద్ద గొప్పగా అనిపిస్తోంది. ఇక వారి సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా 3కోట్లకు అటు ఇటుగా అమ్ముడుపోతున్నాయి. కానీ ఈ వయసులో కూడా వరుస పరాజయాలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎదురులేని సత్తా చాటుతోంది బాలయ్య మాత్రమే అని ఒప్పుకోకతప్పదు. వరుస ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ ‘సింహా’తో.. ఆ తర్వాత మరలా ఫ్లాప్‌లు వచ్చినా ‘లెజెండ్’తో ఆయన తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటికీ తనకు 40కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉందని చాటుతున్నాడు. కాగా ‘లెజెండ్’ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను కూడా జెమిని టీవీ దాదాపు 4కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించి వాటిని దక్కించుకుంది. తాజాగా బాలయ్య నటిస్తున్న ‘లయన్’ చిత్రాన్ని కూడా జెమినీ చానెల్ దాదాపు 7కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంటే ఇప్పుడున్న సీనియర్ స్టార్స్‌లో బాలయ్యే నెంబర్‌వన్ అని ఒప్పుకోవాల్సిందే అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు.