Advertisement
Google Ads BL

‘ఒకే ఒక్కడు యశస్వి ఎస్‌.వి.రంగారావు’ పుస్తకావిష్కరణ


తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎస్‌.వి.రంగారావుకి ఓ విశిష్టత వుంది. ఎస్వీఆర్‌ అభినయం, ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు ప్రత్యేకతను కలిగి వుంటాయి. ఆయన ఎంతోమంది నటీనటులకు ఆదర్శం. తెలుగులోనే కాదు తమిళంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నట యశస్విగా పేరు తెచ్చుకున్న ఎస్‌.వి.రంగారావు సమగ్ర సినీ జీవితాన్ని పుస్తకరూపంలోకి తెచ్చారు సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు. ‘ఒకే ఒక్కడు యశస్వి ఎస్‌.వి.రంగారావు’ పేరుతో పసుపులేటి రామారావు రచించిన ఈ పుస్తక ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణకు అందించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌, నిర్మాత బి.ఎ.రాజు, ప్రముఖ దర్శకురాలు జయ బి. సంయుక్తంగా ఈ ప్రతిని రూ.5,000లకు కొనుగోలు చేశారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రూ.20,000లతో 100 కాపీలు కొనుగోలు చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం పత్రికాధినేత సురేష్‌ కొండేటి కూడా ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్‌ నిర్మాత కృష్ణవేణి, డా॥ పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌.నారాయణమూర్తి, సీనియర్‌ నటి గీతాంజలి, యువకళావాహిని వై.కె.నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కరణ సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సారధ్యంలో, యువకళావాహిని ఆధ్వరంలో జరిగింది. డా॥ బ్రహ్మానందం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పసుపులేటి రామారావు శాలువాలతో సత్కరించారు. డా॥ దాసరి నారాయణరావు ప్రత్యేక జ్ఞాపికతో పసుపులేటి రామారావును సత్కరించారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

డా॥ దాసరి నారాయణరావు: ఈ ఇండస్ట్రీలో నలభై సంవత్సరాలుగా మార్పులేని వ్యక్తుల్ని ఇద్దర్నే చూస్తున్నాను. పసుపులేటి రామారావు, నారాయణమూర్తి. వీళ్ళిద్దరూ అప్పుడెలా వున్నారో ఇప్పుడూ అలాగే వున్నారు. ఎస్‌.వి.రంగారావుగారి చరిత్ర రాయడానికి రామారావు ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఈరోజు చరిత్ర మనకు చాలా అవసరం. చరిత్ర లేకపోతే కొన్నాళ్ళ తర్వాత మనం ఎవరమో ఎవరికీ తెలీదు. టి.వి. అనేది లేకపోతే ఎంతో మహానటులు కనుమరుగైపోయేవారు. దానికి ఉదాహరణ సీనియర్‌ నిర్మాత సి.కృష్ణవేణిగారు. కీలుగుర్రం, లక్ష్మమ్మ, మనదేశం వంటి పదిహేను సినిమాలకు ఆమె నిర్మాతనీ, ఆ తర్వాత నాతో తీసిన శ్రీవారి ముచ్చట్లు, రావణుడే రాముడైతే చిత్రాల నిర్మాత అని ఎంతమందికి తెలుసు. ఎన్‌.టి.రామారావుగారిని పరిచయం చేసింది ఎవరని అడిగితే ఎవరెవరి పేర్లో చెబుతారు. కానీ, ఆయన్ని పిలిపించి టెస్ట్‌ చేసి తన సినిమాలో బుక్‌ చేసిన మహాతల్లి కృష్ణవేణి. ఇది చరిత్రలో గుర్తు వుండదు. ఎన్‌.టి.రామారావుగారినే కాదు, ఎస్‌.వి.రంగారావుగారిని, ఘంటసాలగారిని కూడా పరిచయం చేసింది కృష్ణవేణే. ఇలాంటి గొప్పవాళ్ళు ఎంతో మంది ఇండస్ట్రీలో వున్నారు. వారి జీవిత చరిత్రలు రావాల్సిన అవసరం వుంది. ఎస్‌.వి.రంగారావుగారు నాకు దేవుడు. నా మొదటి సినిమా  కథానాయకుడు. ఆయన కనక ఆ పాత్ర వేసి వుండకపోతే ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అయి వుండేది కాదు. ఇంత పెద్ద దర్శకుడ్ని అయ్యేవాడ్ని కాదు. తాత మనవడు చిత్రం కంటే ముందే బాగా పరిచయం. ఒక చంటిపిల్లాడి మనస్తత్వం. కోపం, తాపం నిముషమే. ఆయనతో వర్క్‌ చెయ్యడం చాలా హ్యాపీ. అలాంటి మహానటుడి గురించి పుస్తకం రాయడం ద్వారా, ఇక్కడికి పిలవడం ద్వారా మమ్మల్ని రీచార్జ్‌ చేశాడు. 

బ్రహ్మానందం: 25 సంవత్సరాలు పసుపులేటి రామారావుగారిని చూస్తున్నాను. అప్పుడు ఎలా వుండేవారో ఇప్పుడూ అలాగే వున్నారు. అదే సింప్లిసిటీ, అదే సిన్సియారిటీ. చిత్ర పరిశ్రమలో ఎస్‌.వి.ఆర్‌. అంటే ఒక్కడే. అందుకే ఒకే ఒక్కడు యశస్వి అన్నారు. నటనకు రూపం వుంటే ఇలా వుంటుందా అనిపించేంతగా ఆయన అందర్నీ ఆకట్టుకున్నారు. ఎస్వీఆర్‌గారితో నటించే అవకాశం నాకు రాలేదు. కానీ, ఆయన గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ పుస్తకం మొత్తం చదివాను. రామారావుగారు చాలా బాగా రాశారు. 

కృష్ణవేణి: లేడీ డాక్టర్‌ పేరుతో అప్పట్లో నేను ఒక సినిమా స్టార్ట్‌ చేశాను. అందులో ఎస్వీరంగారావుగారు నాకు తండ్రిగా నటించారు. అయితే ఆ సగం షూటింగ్‌ జరిగిన తర్వాత పూర్ణ పిక్చర్స్‌ వారితో గొడవ వచ్చి ఆ చిత్రాన్ని ఆపేశాను. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఎస్వీఆర్‌గారి గురించి రామారావుగారు ఈ పుస్తకాన్ని రచించడం నిజంగా అభినందనీయం. 

పరుచూరి గోపాలకృష్ణ: ఎస్‌.వి.రంగారావుగారిని గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు పసుపులేటి రామారావుగారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకళావాహిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేం రాసిన డైలాగులు ఆయన నోటి వెంట వినే భాగ్యం మాకు కలగలేదే అని చాలాసార్లు బాధపడ్డాము. ఎస్వీఆర్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులోనే కాదు, తమిళ్‌లో కూడా ఆయనకు చాలా మంచి పేరు వుంది. 

తమ్మారెడ్డి భరద్వాజ: గొప్ప నటుడు ఎస్వీఆర్‌గారి సినీ జీవితాన్ని ఒక పుస్తకరూపంలోకి తెచ్చిన పసుపులేటి రామారావుగారిని అభినందిస్తున్నాను. ఎంతో మంది మహోన్నత వ్యక్తులు చిత్ర పరిశ్రమలో వున్నారు. వారి గురించి కూడా పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఆర్‌.నారాయణమూర్తి: చాలా ఫాస్ట్‌గా డైలాగ్స్‌ చెప్పినా అర్థమయ్యేట్టు చెప్పేవారు చాలా తక్కువ. నాకు తెలిసి అలాంటివారు ముగ్గురు వున్నారు. ఒకటి ఎస్‌.వి.రంగారావుగారు, రెండు మా గురువుగారు దాసరి నారాయణరావుగారు, మూడు నాగేష్‌గారు. తెలుగులో ఎస్వీఆర్‌గారికి, సావిత్రిగారికి ఎంత పెద్ద పేరు వుందో తమిళ్‌లో కూడా అంతే పేరు వుంది. అంతటి గొప్ప వ్యక్తి జీవితం పుస్తకంగా రచించిన రామారావుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

గీతాంజలి: ఎస్వీ రంగారావుగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం నాకు కలిగింది. మా కుటుంబంతో ఆయనకు ఎంతో అన్యోన్యత వుంది. ఎస్వీఆర్‌గారి సినీ జీవితం పుస్తకంగా వస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది. 

కైకాల సత్యనారాయణ: ఎస్వీ రంగారావుగారితో నాకు ఎంతో అనుబంధం వుంది. మేమిద్దరం కలిసి చేసిన తాత మనవడు ఎంత మా అందరికీ ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలుసు. చాలా మంచి మనసున మనిషి. ఈ సందర్భంగా ఆయన్ని తలుచుకోవడం చాలా ఆనందంగా వుంది.

పసుపులేటి రామారావు: ఈ పుస్తకం రాయడంలో నాకు సహకరించిన వారు ముగ్గురు. నేను మూడు టైటిల్స్‌ అనుకుంటే మా గురువుగారు దాసరి నారాయణరావుగారు అందులో ఈ టైటిల్‌ని సెలెక్ట్‌ చేశారు. మిత్రులు పులగం చిన్నారాయణ, వినాయకరావు ఈ పుస్తకాన్ని తేవడంలో ఎంతో సహకరించారు. కావాల్సిన కొంత మెటీరియల్‌, కొన్ని స్టిల్స్‌ నాకు ఇచ్చి సహకరించారు. అలాగే గురువుగారు దాసరి నారాయణరావుగారు కూడా ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేయడానికి మిత్రులు రాంబాబుగారు నాకు ధైర్యం చెప్పి యువకళావాహిని వారితో మాట్లాడి ఓకే చేయించారు. ఈ ఫంక్షన్‌ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారకులైన యువకళావాహిని సారిపల్లి కొండలరావుగారికి, వై.కె.నాగేశ్వరరావుగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs