మొత్తానికి జూనియర్ మారాడు. హిట్ దర్శకుల వెంట పడే తన మనస్తత్వాన్ని వదిలి టాలెంట్ కు పట్టం కట్టడం నేర్చుకుంటున్నాడు. పెద్దగా హిట్స్ లేని సమయంలో పూరీకీ ఆయన 'టెంపర్' చిత్రంతో అవకాశం ఇవ్వడం, ఫామ్ కోల్పోయిన పూరీ మరలా తానేమిటో 'టెంపర్'తో నిరూపించుకోవడం జరిగిపోయాయి. ఇక తన కిందటి చిత్రం మహేష్ తో '1'(నేనొక్కడినే)తో డిజాస్టర్ చవిచూసిన సుకుమార్ కు అనుకున్న మాట ప్రకారం సినిమా చేస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ సాహసం చేస్తున్నాడు. లెక్కల మాస్టర్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతకీ ఈ సినిమా ఎన్టీఆర్ స్టైల్ లో ఉంటుందా? లేక సుకుమార్ స్టైల్ లో ఉంటుందా? అనేది తేలాల్సివుంది. అసలు ఎన్టీఆర్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోని, అర్ధం కాని సబ్జెక్ట్ లు డీల్ చేసే సుకుమార్ హ్యాండిల్ చేయగలడా? వాస్తవానికి కన్ ఫ్యూజన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సుకుమార్ అనే పేరుంది. మరి ఈయన ఎన్టీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.