శ్రీశాంత్ తన కెరియర్‌లో చాలా తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఐపీఎల్ పుణ్యమా అని తిరిగి అంతకంటే వేగంగా పాతాళానికి పరుగులు పెట్టాడు. ఇక ఐపీఎల్ బెట్టింగ్‌స్కాంలో ఇరుక్కున్న శ్రీశాంత్ గతంలో 26 రోజులపాటు తీహార్ జైల్‌లో శిక్షను అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ జైల్‌లో ఉన్నప్పుడు శ్రీశాంత్‌పై హత్యాయత్నం జరిగినట్లు తాజాగా బయటపడింది. జైల్‌లో శ్రీశాంత్ వాకింగ్ చేస్తుండగా ఓ ఖైదీ పదునైన కత్తితో ఆయనపై దాడి చేశాడని, అయితే శ్రీశాంత్ తప్పించుకోవడంతో పెద్దగా గాయాలు కాలేదని ఆయన బావ బాలకృష్ణన్ వెల్లడించాడు. అప్పుడే ఆ విషయాన్ని మీడియాకు తెలియజేద్దామనుకున్నా.. అనవసరంగా విషయాన్ని రాద్దాంతం చేసినట్లు అవుతుందని ఆగిపోయినట్లు చెప్పారు. మరి శ్రీశాంత్‌పై దాడి వెనుక అసలు నిజమేమిటో కనిపెట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ బెట్టింగ్‌లో ఉన్న పెద్దలే శ్రీశాంత్‌ను మట్టుబెట్టడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.