హైదరాబాద్‌వాసుల కలల ప్రాజెక్టు మెట్రో మొదటి దశ మార్చి 21న ప్రారంభం అవుతుందని నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మెట్టుగూడ, నాగోల్ మధ్య ఎనిమిది కిలోమీటర్ల వ్యవధిలో ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే అమెరికా రాయబారితో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ చావు కబురు చల్లగా చెప్పారు. వచ్చే ఏడాదే మెట్రోను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దీంతో నగరవాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ మార్గంలో ట్రయల్‌రన్ పూర్తి చేసుకొని రైల్వే నుంచి అన్ని అనుమతులు పొందినప్పటికీ వచ్చే ఏడాదికి మెట్రోను ఎందుకు వాయిదా వేశారన్నది అర్థంకాకుండా ఉంది. ఇక మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కూడా ఎప్పటినుంచో మార్చిలోనే మొదటిదశను ప్రారంభిస్తామని చెబుతోంది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో ఆ సంస్థ కూడా నోరు మెదపడం లేదు. ఇదే విషయమై అధికారులను ప్రశ్నిస్తే నాగోల్, మెట్టుగూడ మధ్య మెట్రోను ప్రారంభించినా ఎలాంటి ఉపయోగం ఉండదని, కనీసం నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకైనా మెట్రోను నడిపితే ప్రజలకు మేలు చూకూరుతుందని చెబుతున్నారు. మరి ఈ విషయం తెలియకుండానే రెండేళ్లుగా నాగోల్-మెట్టుగూడ మధ్య మొదటి దశలో మెట్రోను నడపాలని ఎందుకు నిర్ణయించారన్న ప్రశ్న తలెత్తక మానదు. కాని దీనివెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. నామ్‌కే వాస్తే.. ఎలాంటి ఉపయోగం లేని నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రోను ప్రారంభించడం కంటే కనీసం రెండు మార్గాల్లో పూర్తిస్థాయిలో మెట్రోను పూర్తి చేసి ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెండు మార్గాల్లో మెట్రోను ప్రారంభించిన తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లే టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.