రాష్ట్ర విభజన విద్యార్థులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గ్రూప్స్ మొదలు.. ప్రాథమిక స్థాయి పాఠశాలల వరకు సిలబస్‌లు మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు ఇప్పుడు కసరత్తులు జరుగుతున్నాయి. తెలంగాణ చరిత్రను హైలెట్ చేసేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగారు. ఏపీలో సీమాంధ్ర ప్రాంతం ముద్రను ప్రతిబింబించేలా సిలబస్‌లు మార్పులు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్ మార్పు బాధ్యతను యూనివర్సిటీలకు అప్పగించగా.. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో సిలబస్ మార్పును ఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓ కమిటీకి అప్పగించారు. ఇప్పటికే పని పూర్తి చేసిన ఈ కమిటీ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌లో ఈ మార్పులను ఆచరణలో పెట్టనున్నారు.