యూపీఏ హయాంలో ఒక దాన్ని మించి మరో కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. 2 జీ స్కాం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ తదితర కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయ్యింది. ఇక తాజాగా మోడీ హయాంలో మరో కుంభకోణం బయటపడింది. పెట్రోలియం మంత్రిత్వశాఖకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ స్కాం విలువ వందల కోట్లు ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ స్కాం విలువ 10 వేల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇద్దరు జాయింట్ సెక్రెటరీలపై కూడా విచారణ సాగిస్తున్నారు. ఈ లీకేజీ స్కాం కేవలం పెట్రోలియం శాఖకే పరిమితమైందా..? లేక ఇతర శాఖల్లో కూడా ఈ వ్యవహారం కొనసాగుతుందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అంతేకాకుండా ఈ స్కాంలో ఓ విలేకరి ప్రధాన నిందితుడిగా ఉండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో నీరా రాడియా రూపంలో 2 జీ స్కాంలో ఓ మీడియా ప్రతినిధి నిందితురాలిగా ఉండగా.. ఇప్పుడు లీకేజీ స్కాంలోనూ ఓ విలేకరి ప్రధాన పాత్రంలో ఉండటం గమనార్హం.