ఓ భారీ చిత్రం డిజాస్టర్ అయితే చాలా తలనొప్పులు వస్తాయి. రజనీ కాంత్ బర్త్ డే కానుకగా విడుదలైన 'లింగ' చిత్రం బాక్సా ఫీస్ వద్ద ఘోరంగా విఫలం అవ్వడమే కాదు.. తమిళనాడులో అన్ని చోట్లా 40 శాతాన్ని మాత్రమే రికవరీ చేయగలిగింది. కొన్ని ఏరియాలలో అయితే 20 శాతం కూడా వసూలు కాలేదు. అందువల్ల తమకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పంపిణీదారులు హీరో రజనీకాంత్ ను, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ను కోరుతూ వచ్చారు. చివరకు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తను కేవలం 10 శాతం మాత్రమే తిరిగి చెల్లించగలనని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పడంతో ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసి వినూత్నంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరసనలో భాగంగా రజనీకాంత్, రాక్ లైన్ వెంకటేష్ ల ఇళ్ల ముందే కాకుండా 'లింగ' చిత్రం విడుదలైన ధియేటర్ల వద్ద కూడా భిక్షాటన చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే జరిగితే నిర్మాత సంగతేమో కానీ, రజనీ పరువంతాపోతుందని అభిమానులు ఆందోళన పడుతున్నారు. సాధ్యమైనంతగా రజనీ వెంటనే కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.