కేసీఆర్ బీజేపీ పార్టీకి దగ్గరవడానికి తహతహలాడుతున్నట్లు రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. రేపోమాపో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్‌డీఏలో చేరడం ఖాయమని, కేంద్రంలో టీఆర్‌ఎస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని వార్తలు వెలువడుతున్నాయి. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కుతాయని చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక కేంద్రంలో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ కవిత, కేశవరావులకు మంత్రి పదవులు ఖాయమని, ఇక అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ తరఫున కిషన్‌రెడ్డికి, లక్ష్మణ్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయని సమాచారం. ఇక సోమవారం కేసీఆర్ ప్రధాని మోడీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలుసుకోవడం ఈ వార్తలను మరింత బలపర్చాయి. కేసీఆర్ తన కుమార్తెకు మంత్రి పదవి దక్కించడానికే ఎన్‌డీఏలో చేరుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తుండగా, కేంద్రంలో రాష్ట్రానికి అధికంగా నిధులు రప్పించడానికే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లు టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.