నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంచనాలను మించి అఖండ విజయం సాధించింది. ఇక మొదటి సీజన్‌లాగానే రెండో సీజన్‌లోనూ ఈ ప్రోగ్రాం టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా టాప్ ప్రోగ్రాంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం పబ్లిసిటీ స్టంట్‌గా కూడా ఉపయోగపడుతోంది. గతంలో 'ముకుందా' సినిమా విడుదల సందర్భంగా వరుణ్‌తేజ్ ఈ ప్రోగ్రాంకు వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత 'బీరువా' కోసం సందీప్ కిషన్ కూడా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' వీలైనంతమంది ప్రేక్షకులకు దగ్గర కావాలని చూశాడు. ఇక తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంకు హాజరయ్యాడు. త్వరలో విడుదల కానున్న తన 'అనేకుడు' సినిమా పబ్లిసిటీ కోసం ధనుష్ ఈ ప్రోగ్రాంకు హాజరై ఆ సినిమా విశేషాలను నాగార్జునతో పంచుకున్నారు. ఇటీవలే 'రఘువరన్ బీటెక్'తో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ ఇప్పుడు టాలీవుడ్‌పై కూడా దృష్టిపెట్టాడు. రంగం ఫేం కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న 'అనేకుడు'పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా ఆడియో విడుదలకానుంది.