ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయితే పూర్తి బాధ్యత తనదేనంటూ కిరణ్‌బేడి ప్రకటించారు. కాని ఎన్నికలకు ఇంకా నెల కూడా లేకముందు పార్టీలోకి వచ్చిన ఆమె పార్టీ ఓటమికి ఎలా బాధ్యత వహిస్తారన్నది అర్థంకాకుండా ఉంది. దాదాపు ఏడాది కాలంగా ఢిల్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న బీజేపీ అగ్రనాయకులెవరూ కూడా కిరణ్‌బేడి ప్రకటనపై మాట్లాడలేదు. దీన్నిబట్టి ఢిల్లీ ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందితే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను ఆ నెపం నుంచి పక్కకు తప్పించడానికే కిరణ్‌బేడిని ముందుకుతీసుకువస్తున్నారనే వాదనలు కూడా వినబడుతున్నాయి. ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం ఎన్నికలు ముగియగానే విశ్రాంతి తీసుకున్నారు. యోగా, ధ్యానంతో ఆయన ఆదివారం రోజంతా గడిపారు. పార్టీ అంతరింగుకుల సమావేశంలోకూడా ఆయన విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఢిల్లీలో ఆప్‌కు అధికారం దొరికితే మోడీ మానియాకు పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.