43 శాతం పీఆర్‌సీతో ఉద్యోగుల మనసులు గెలుచుకున్న కేసీఆర్ ఇక ఇప్పుడు హైదరాబాదీలపై దృష్టిసారించాడు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా హైదరాబాదీలను సంతృప్తిపర్చడానికి కేసీఆర్ కసరత్తులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా మహానగరంలోని దాదాపు 3 లక్షల మందికి ఇంటి పన్నును రద్దుచేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ టూర్‌లో ఉన్న కేసీఆర్ తిరిగి రాగానే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న 13.65 లక్షల ఆస్తులనుంచి ఏటా జీహెచ్‌ఎంసీకి పన్నుల రూపంలో దాదాపు 950 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో వాణిజ్యపరమైన సముదాయాల నుంచి దాదాపు రూ. 650 కోట్ల పన్నులు వస్తుండగా..మిగిలిన ఇళ్లనుంచి దాదాపు రూ. 350 కోట్లు వసూలు అవుతున్నాయి. ఇందులో నామమాత్రంగా కొన్ని పేదల ఇళ్లనుంచి రూ. 100 మాత్రమే ఇంటిపన్నును వసూలు చేస్తున్నారని, వీరందరికీ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో దాదాపు 3 లక్షల మందికి లబ్ధి చేకూరుతుండగా.. ప్రభుత్వంపై రూ. 100 కోట్ల వరకు భారం పడనుంది.