ఒక నాయకుణ్ని ప్రజలు సదా గుర్తుచేసుకునేందుకు విగ్రహాలు ఎంతో దోహదం చేస్తాయి. ఇందిరా, రాజీవ్‌లు మృతిచెంది దశాబ్దాలు గడిచినా వారి విగ్రహాలు, వారి పేర్లపై ఉన్న పథకాలు వారిని ప్రజల్లో చిరస్మరణీయులను చేశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ మరణాంతరం పెద్ద ఎత్తున ఆయన విగ్రహాలు వెలిశాయి. దాదాపు ప్రతి మండలం, గ్రామంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పాయి. అయితే ఇప్పుడు ఆ విగ్రహాలను తొలగించడానికి బాబు సన్నాహాలు చేస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న విగ్రహాలను తక్షణం తొలగించాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్నందునా ఎన్టీఆర్ విగ్రహాల వద్దకు వెళ్లేందుకు అధికారులు సాహసించే అవకాశం లేదు. అదే సమయంలో వైఎస్ విగ్రహాలను తొలగించాలని అధికారులపై అధికారపక్షం ఒత్తిడి చేసే అవకాశం ఉంది. మరి వైఎస్ విగ్రహాల తొలగింపును జగన్ మోహన్‌రెడ్డి ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.