ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది కరెంటు కోతలు. ఇక ఎండాకాలం సమీపిస్తుండటంతో కోతలు పెరిగిపోతాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి తగ్గినట్లే ప్రభుత్వం కూడా వేసవిలో కరెంటు కోతలు తప్పవని ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. ఇక ఇదే సమయంలో కృష్ణాపట్నంలో తెలంగాణలో కరెంటు వాటా ఇచ్చేది లేదని ఏపీ తేల్చిచెప్పింది. అయితే వేసవిలో తెలంగాణకు ఏపీనుంచి కరెంటు సరఫరా అయ్యేలా తాను చూస్తానని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి చెబుతున్నారు. తాను చంద్రబాబుతో మాట్లాడి అక్కడినుంచి కరెంటు సరఫరా అయ్యేలా చూస్తానని ఆయన చెప్పారు. గతంలో కూడా కేసీఆర్ లేఖ రాస్తే ఏపీనుంచి కరెంటు ఇస్తారని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు కరెంటుకోసం లేఖ రాస్తే తన పరువు పోతుందని కేసీఆర్ భావించి తెలంగాణ ప్రజలను కరెంటు కోతలతో ముప్పతిప్పలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతుంటే స్వయంగా చంద్రబాబు స్పందించి కరెంటు ఎందుకు సరఫరా చేయ్యలేదనేది అర్థంకాని ప్రశ్న.