అప్పుడెప్పుడో టాలీవుడ్ లో మంచి హిట్ అయిన మహేష్ బాబు 'ఒక్కడు' చిత్రాన్ని ఇటీవల బాలీవుడ్ లో 'తేవర్' పేరుతో రీమేక్ చేసి ఓ ఫ్లాప్ ను చవిచూసిన హీరో అర్జున్ కపూర్. శ్రీదేవి సవతి కొడుకైన అర్జున్ కపూర్ తన రెండో చిత్రానికి కూడా దక్షినాది చిత్రాన్నే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. తమిళంలో జీవా హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చి తెలుగులో కూడా 'రంగం' గా అనువాదమై, రెండు చోట్లా హిట్ గా నిలిచిన 'రంగం' చిత్రాన్ని బాలీవుడ్ లోకి అర్జున్ కపూర్ హీరోగా రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఈ రీమేక్ రైట్స్ ను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఎం.డి.విష్ణు ఇందూరి సొంతం చేసుకొని ఉన్నాడు. పాలిటిక్స్, మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో రూపొందిన 'రంగం' చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్ర హీరో, నిర్మాతల గురించి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కానుంది.