ఈ మధ్యకాలంలో చాలా స్టార్స్ చిత్రాలు లెంగ్త్ ఎక్కువై ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం వాటిని రీ ఎడిట్ చేస్తున్నారు. అయినా కూడా సినిమాలకు మొదటి రోజు వచ్చిన ఫ్లాప్ టాక్ తో రీ ఎడిటింగ్ కూడా సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. తాము తీసిందంతా సినిమాలో ఉండాలని భావించే దర్శకుల మొండిపట్టుదల వల్ల ఎడిటర్లు కూడా ఏమి చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'ఎన్నై అరిందాల్' (తెలుగులో 'ఎంతవాడుకానీ') చిత్రానికి కూడా ఇప్పుడు నిడివి పెద్ద సమస్యగా మారింది. అయితే ముందుగా మేలుకొన్న దర్శకుడు గౌతమ్ మీనన్ అజిత్ పట్టుబట్టడంతో సినిమాను రీ ఎడిట్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రం నిడివి శంకర్ 'ఐ' చిత్రం లాగానే మూడు గంటల 9 నిమిషాలు వచ్చిందట. ఏడు పాటలు, ఐదు యాక్షన్ సీకెన్స్ లు ఉండటం ఇంత నిడివి రావడానికి కారణంగా చెబుతున్నారు. దాంతో గౌతమ్ మీనన్ 25 నుండి 30 నిమిషాలను ట్రిమ్ చేస్తున్నాడట. ఈ చిత్రం ఫిబ్రవరి 5 న విడుదలకు సిద్ధమవుతోంది.