ఆంధ్రప్రదేశ్‌లో చార్జీల మోత మోగనుంది. రాష్ట్ర ప్రజలకు త్వరలో హైవోల్టేజీ షాక్‌నివ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చార్జీల పెంపుపై చేసిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా చార్జీల బాదుడు తప్పదని అధికారవర్గాల అంచనా. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న బాబు తిరిగిరాగానే ఈ విషయమై నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 24న చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్లు విద్యుత్ నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. సాధారణంగా డిస్కంలతో చర్చించి విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఏపీలో మాత్రం డిస్కంల ప్రమేయం లేకుండానే చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.