ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు వరుసగా పలు ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం ఆయన విప్రో అధినేత అజీజ్‌ప్రేమ్‌జీ, వాల్‌మార్ట్ సీఈఓ డేవిడ్ ఛేజ్ రైట్, హీరో మోటోకార్స్ జేఎండీ సునీల్‌కాంత్ ముంజాల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఏపీలో పలు రిటైల్ ఔట్‌లెట్లు ఏర్పాట్లు చేయడానికి వాల్‌మార్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్రంలో పండించే వేరుశనగ, జీడిమామిడి, కొబ్బరి, చిరుధాన్యాలకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక విప్రో సంస్థ అనంతపురంలో సంతూర్ సబ్బుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. అలాగే పెప్సికో సీఈఓ ఇంద్రనూయి ఏపీలో పండించే మామిడి పండ్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వచ్చిన బాబు పెద్ద మొత్తంలో ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.