ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఉప ముఖ్యమంత్రి రాజయ్య పదవికి గండం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్ రాజయ్యను ఆ పదవినుంచే తొలగించాలని నిర్ణయించినట్లు పలు పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. పారా మెడికల్ పోస్టుల భర్తీ, అంబులెన్స్‌ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడినట్లు సమాచారం. అంతేకాకుండా రాజయ్య పనితీరుపై కేసీఆర్‌లో ఉన్న అసంతృప్తికి స్వైన్‌ఫ్లూ వ్యాప్తి మరింత ఆజ్యం పోసింది. ఇక ఈ తరుణంలో ఆయన్ను పదవినుంచి తొలగించడమే మేలన్న నిర్ణయానికి సీఎం వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రభుత్వ పత్రికగా చెలామణి అవుతున్న 'నమస్తే తెలంగాణ'లో కూడా ఈ విషయమై కథనం ప్రచురితం కావడంతో రాజయ్యకు పదవి గండం ఉన్నట్లు ఖరారైంది.