ఇటీవల కాలంలో పలు చిత్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిడివి. తాము తీసిందంతా సినిమాలో ఉండాలని దర్శకులు మొండిపట్టు పడుతుండటంతో ఎడిటర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన 'లింగ, ఐ' చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యే రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'కి ఎదురైందని సమాచారం. ఈ చిత్రం నిడివి దాదాపు 3 గంటల 30 నిమిషాలకు పైగా వచ్చిందిట. దాంతో చాలా సీన్లను ఎడిట్ చేయకుండా ఉండలేని పరిస్థితి ఎదురైందని.. ఈ విషయం ముందుగానే గమనించిన రాజమౌళి మరికొన్ని సీన్లు కలిపి మొత్తానికి 'బాహుబలి'ని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకే సినిమా.. రెండు పార్ట్ లు.. రెండు రిలీజ్ లు.. రెండు సార్లు భారీ ఓపెనింగ్స్ అనే నూతన సూత్రాన్ని పాటిస్తూ రాజమౌళి ముందుకు వెళుతున్నదని అంటున్నారు. అన్నట్లు ఇదే ప్లాన్ ను శంకర్ కూడా అవలంబించి 'ఐ' చిత్రాన్ని కూడా పార్ట్ 1, పార్ట్ 2లుగా విడుదల చేసి ఉంటే ఇంతకంటే మంచి ఫలితం వచ్చి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.