అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గినా ప్రజలకు ఎలాంటి లాభం లేకుండాపోయింది. తగ్గిన ధరలను అనుసరించి దాదాపు లీటర్ పెట్రోల్‌పై రూ. 4.20 వరకు తగ్గాల్సి ఉండగా.. కేంద్రం ప్రత్యేక సుంకంపేరుతో రూ. 2కు కోత పెట్టింది. తాము ఏమీ తక్కువ తినలేదని తెలంగాణ ప్రభుత్వం మరో 2 రూపాయల వ్యాట్ పెంచి వినియోగదారులకు లాభం లేకుండాపోయింది. దీనిపై ప్రజలనుంచి ఎలాంటి అభ్యంతర వ్యక్తం కాకున్నా బంక్‌ల యజమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బంక్‌ల్లో వాహనాలు పెట్రోలు, డీజిల్ పోయించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇటు ఏపీలోనూ అటు మహారాష్ట్రలోనూ తెలంగాణకంటే కూడా రూ. తక్కువకే లీటర్ పెట్రోల్, డీజిల్ లభిస్తుండటంతో ఆ రాష్ట్రాల్లోని బంక్‌లకు పోవడానికే వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని బంక్‌ల యజమానులు స్పష్టం చేశారు. అప్పటికి కూడా ప్రభుత్వ నిర్ణయంలో మార్పురాకుంటే సమ్మెకు కూడా వెనకడామని హెచ్చరిస్తున్నారు.