టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఇక్కడ కాదని బాలీవుడ్ కు వెళ్ళిన మిల్కీ బ్యూటీ తమన్నా అక్కడ ఏదీ కలిసిరాకపోవడంతో తిరుగుటపాలో మరలా ఇక్కడకు వచ్చింది. వచ్చిందే తడవుగా మహేష్ సరసన 'ఆగడు' చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ చిత్రం విజయం సాధిస్తే టాలీవుడ్ లో తనకు తిరుగులేదని భావించింది. కానీ ఆ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్ అయింది. దీంతో ఇక ఆమె కోలీవుడ్ లో అయితేనే తనకు మంచి జరుగుతుందని భావించింది. కాగా ఆమె ప్రస్తుతం తెలుగులో 'బాహుబలి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతోంది. అదే సమయంలో రవి తేజ సరసన 'బెంగాల్ టైగర్' లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినా ఈ అమ్మడికి టాలీవుడ్ పై నమ్మకం కలగడం లేదు. ఇంత కాలం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల కోసం మెరుపు తీగలా ఉన్న తమన్నా... తాజాగా కొంచెం బొద్దుగా మారింది. ఆ మాత్రం బొద్దుగా లేకపోతే తమిళ తంబీలు ఆదరించరనే ఆలోచనతోనే ఆమె వెయిట్ పెరిగిందంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు వచ్చిన ఆమె బొద్దుగా మారడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 'బాహుబలి' కోసం 6కిలోలు వెయిట్ తగ్గిన ఈ భామ ఇప్పుడు దానికి రెండింతలు బరువు పెరిగిందట. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆర్య సరసన ఓ చిత్రంలో నటిస్తోన్న ఆమె త్వరలో కోలీవుడ్ ను శాసించాలనే తాపత్రయంలో ఉందట...!