క్రూడాయిల్ ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రకారం చూస్తే లీటర్ పెట్రోల్‌పై కేంద్రం కనీసం రూ. 4.42, డీజిల్‌పై రూ. 4.25 వరకు ధర తగ్గించాల్సి ఉంది. అయితే కేంద్రం మాత్రం రాత్రికి రాత్రి ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధరలు రూ. 2.22, డీజిల్ ధర రూ. 2.25 వరకు తగ్గిపోయియి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న చందంగా పెట్రోల్ కనీసం రూ. 2 ధరనైనా తగ్గిందని వాహనదారులు సంతోషించారు. అయితే తెలంగాణ ప్రజలకు ఆ సంతోషం కూడా లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుంది. పెట్రోల్ ధరలు తగ్గిపోవడంతో పన్ను ఆదాయం తగ్గిపోతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 2 వ్యాట్ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక రాష్ట్రంలో పెట్రోల్ ధరలో పెద్దగా మార్పు ఉండదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచే ప్రభుత్వాలు.. అక్కడ ధరలు తగ్గించినప్పుడు మాత్రం అధిక పన్నులు వేస్తూ ధరలో మార్పు లేకుండా చూసుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.