రాష్ట్ర విభజనతో మీడియా దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా మీడియా ఉండాలని భావిస్తున్న యాజమాన్యాలు ఆ మేరకు న్యూస్ చానళ్లను, పేపర్లను విడదీస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో రెండు పత్రికలు పేర్లను మార్చుకొని తెలంగాణలో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతవరకు సీపీఎం అధికారికపత్రిక 'విశాలాంధ్ర' రెండు రాష్ట్రాల్లోనూ ప్రచురించబడేది. ఇప్పుడు తెలంగాణ వరకు దీని పేరు మార్చి ఆంధ్రలో మాత్రం అలాగే కొనసాగించాలని యాజమాన్యం భావించింది. ఈ మేరకు 'మన తెలంగాణ' పేరుతో ఈ పత్రికను తెలంగాణలో ప్రచురించాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఇకపై మన తెలంగాణ పత్రిక స్వతంత్య్రంగా నడుస్తుందని పత్రిక సంపాదకులు కె. శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అదే విధంగా ఇక సీపీఐ పార్టీ అనుబంధ పత్రిక 'ప్రజాశక్తి' కూడా పేరు మార్చుకోనుంది. ఈ పత్రిక 'నవ తెలంగాణ'గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజాశక్తి పేరుతోనే కొనసాగనుంది.