వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పంథా మార్చినట్టు కనబడుతోంది. ఇటు టీఆర్‌ఎస్‌ను అటు బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇంతకుముందు వైసీపీ నాయకులు సహసించేవారు కాదు. ఇక అధినేత జగన్ సూచనతోనే వైసీపీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అందరూ భావించారు. అయితే మొదటిసారి వైసీపీ నాయకులు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గుతున్నప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు ఆ స్థాయిలో తగ్గడం లేదని కేంద్రాన్ని విమర్శించారు. లేనిపోని ట్యాక్స్‌ల పేరుతో కేంద్రం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని, అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతున్న ధరలనుగుణంగా పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మరి మొదటిసారి బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎందుకు విమర్శలకు దిగిందనేది అంతుపట్టకుండా ఉంది. అయితే వైసీపీ నాయకులు ఎక్కడ కూడా బీజేపీ అనకుండా ఎన్‌డీఏ ప్రభుత్వం అని సంబోధించడం కొసమెరుపు.