పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందంటే ఆయనకి ఉన్నది అభిమానులు కాదు.. భక్తులు అనేంత రేంజిలో ఉంది. వెండితెరపై మోడ్రన్ శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చిన పవన్ కు థియేటర్లలోనే కొబ్బరి కాయలు కొట్టడం... హారతులు ఇవ్వడం చేస్తున్నారు. ఇక కొందరైతే ఏకంగా గుండుపై 'గోపాల గోపాల' టైటిల్ ను, పవన్ ఫోటో వచ్చే విధంగా హెయిర్ కట్ చేసుకున్నారు. ఇక పవన్ ను దేవుడిగా భావించే యువ హీరో నితిన్ కూడా ఆయనపై అభిమానం చాటుకోవడానికి వీరాభిమానం చూపించాడని సమాచారం. పవన్ ను వెండితెరపై దేవుడి రూపం లో చూడగానే నితిన్ వేలు కోసుకొని ఆ రక్తంతో పవన్ ఫొటోకు రక్తతిలకం దిద్దినట్లు తెలుస్తోంది. ఇంతకాలం కేవలం తన సినిమా పబ్లిసిటీ కోసం నితిన్ పవన్ పై అభిమానం చూపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా రక్తతిలకం దిద్దడం తప్పే అయినప్పటికీ నితిన్ కు పవన్ పై ఉన్న నిజమైన అభిమానం ఈ చర్యతో రుజువైందని కొందరు అంటున్నారు. ఇక పవన్ పై అభిమానులు చూపిస్తున్న మితిమీరిన అభిమానం చూసి ఆశ్చర్య పోతున్న వర్మ వంటి వాళ్ళు ట్విట్టర్లలో తమ చేతికి పని పెడుతున్నారు. పవన్ సినిమా విడుదల రోజే చిరంజీవి 150వ చిత్రం విదుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా 'గోపాల గోపాల' చిత్రం క్రేజ్ ను కొన్ని ప్రైవేట్ బస్సులు క్యాష్ చేసుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా నడుపుతోన్న బస్సులో ఈ చిత్రం పైరసీ సిడీలను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఓ పవన్ వీరాభిమాని ఈ విషయాన్ని గమనించడంలో ఈ వ్యవహారం బయటపడిందని తెలుస్తోంది.