కేసీఆర్ వినూత్న ఆలోచనలు.. అందరిలోనూ ఆసక్తిరేకిత్తిస్తున్నాయి. అసలు అమలుకు సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశహర్మాలు నిర్మిస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు. అయితే అక్కడున్న భూమి పెద్ద భవంతుల నిర్మాణానికి అనుకూలించదని నిపుణులు చెప్పారు. అటు తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు. ఆపై ఓఆర్‌ఆర్ చుట్టూ మరో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు మొదలవ్వలేదు. ఇలా రోజుకోటి చొప్పున కేసీఆర్ నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోటుకి చేరుస్తానని, ప్రతి జిల్లాలో 15 ఎకరాల భూమిలో అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను నిర్మించనున్నట్లు కేసీఆర్ ప్రకటించాడు. ఈ ఆలోచన బాగానే ఉంది. ప్రజలకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను నిర్మించడానికి నిధులున్నాయా..? గతంలో హామీలిచ్చిన సంక్షేమ పథకాలు అమలు పరిస్థితి ఏంటి..? కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్ధంతరంగా ఆగిపోయిన ఇందిరమ్మ గృహాల భవిష్యత్తు ఏంటి..? తదితర సమస్యలపై స్పందించి ఆ తర్వాత కొత్త పథకాల గురించి కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.