Advertisement
Google Ads BL

సీనియర్‌ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఇకలేరు


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆస్తమాతో బాధపడుతున్న వి.బి.రాజేంద్రప్రసాద్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1932 నవంబర్‌ 4న కృష్ణాజిల్లా డోకిపర్రు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. వారిలో జగపతిబాబు హీరోగా మంచి పేరు తెచ్చుకొని నటుడుగా కొనసాగుతున్నారు. వి.బి. నటుడు కావాలన్న కోరికతో మద్రాస్‌ వెళ్ళారు. అక్కడ ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు పరిచయమయ్యారు. వి.బి.ని దుక్కిపాటి మధుసూదనరావుకి పరిచయం చేశారు. కానీ, నటుడుగా వి.బి.కి అవకాశాలు రాలేదు. దాంతో అక్కినేని ప్రోత్సాహంతోనే తన తండ్రిగారైన జగపతి పేరు మీద నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలిచిత్రంగా ‘అన్నపూర్ణ’ నిర్మించారు. ఆ తర్వాత ‘దసరాబుల్లోడు’ చిత్రంతో దర్శకుడుగా మారారు. ఆ తర్వాత చాలా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Advertisement
CJ Advs

ఆయన సొంత బేనర్‌లోనే కాకుండా బయటి బేనర్‌లో ‘అందరూ దొంగలే’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. తమ బేనర్‌లో 16 చిత్రాలు నిర్మించిన వి.బి. ఎనబై దశకం తర్వాత విజయాలు తగ్గడంతో చిత్ర నిర్మాణాన్ని తగ్గించారు. దసరాబుల్లోడు, బంగారుబాబు, మంచి మనుషులు, రామకృష్ణులు ఆయనకు దర్శకుడిగా చాలా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆరాధన, అంతస్తులు, ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెలు వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలను ఆయన నిర్మించారు. సినీపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిన తర్వాత ఫిలింనగర్‌లో ఆయన ఆధ్వర్యంలో ఫిలింనగర్‌ దైవసన్నిధానం నిర్మించారు. ఆయన శేష జీవితాన్ని దైవసన్నిధానికే అంకితం చేశారు. మంచి మనిషి, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న రాజేంద్రపసాద్‌ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా చెప్పుకోవాలి. ఆయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దర్శకుడుగా, నిర్మాతగా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న వి.బి.రాజేంద్రప్రసాద్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది ‘సినీజోష్‌’. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs