ఏపీ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. రోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాల పేరుతో మున్సిపల్ కమిషనర్లకు సమయం లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి సమావేశాలతోనే సమయం గడిచిపోతోందని, ప్రజాసమస్యలపై తాము దృష్టి సారించలేకపోతున్నామని కమిషనర్లు ఆరోపిస్తున్నారు. తన విద్యాసంస్థలను విజయం పథంలో నడపడానికి కూడా నారాయణ గతంలో కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు కూడా మంత్రి అలాగే ప్రతి మున్సిపాల్టీ గురించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రాజకీయ ఒత్తిళ్లు లేకపోతేనే తాము స్వేచ్ఛగా పనిచేయగలుగుతామని, సమస్యలు పరిష్కరించగలుగుతామని కమిషనర్లు చెబుతున్నారు. అయితే తన కార్పొరేట్ విద్యాసంస్థలను విజయం పథంలో నడిపిన మాదిరిగానే కమిషనర్లపై ఒత్తిడి తెచ్చి మున్సిపాల్టీలను అభివృద్ధి చేయాలని నారాయణ భావిస్తున్నట్లున్నారు.