రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు బ్యాంకులకు చుక్కలు చూపిస్తన్నాయి. రెండు రాష్ట్రాలకు ఉన్న ఉమ్మడి ఖాతాల్లోని నిధులపై ఎవరి పెత్తనాన్ని అంగీకరించాలో తెలియక బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఉన్నతావిద్యాశాఖ మండలికి సంబంధించిన కొన్ని కోట్ల రూపాయల నిధులు ఆంధ్ర బ్యాంకులో ఉన్నాయి. అయితే ఈ బ్యాంకులోని నిధులను ఏపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వెంటనే ఖాతాలను ఫ్రీజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. దీనిపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఖాతాలు స్తంభింపజేస్తే బ్యాంకుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో ఏంచేయాలో తెలియక బ్యాంకు యాజమాన్యం తికమకపడుతోంది. ఇక ఉన్నత విద్యామండలికే కాకుండా పలు ఇతర సంస్థలకు కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఖాతాలున్నాయి. మరి ఈ ఖాతాలకు సంబంధించి కూడా ఇదే సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది. దీనిపై కేంద్రం త్వరగా ఓ పరిష్కార మార్గాన్ని చూపకపోతే బ్యాంకులకు సమస్యలు తప్పే అవకాశాలు కనిపించడం లేదు.