తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన శైలిని చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో లంచాలను చట్టబద్ధం చేసేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖను చూస్తున్న రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రజలకు సరైన సేవలు అందుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. అంతేకాకుండా వైద్య సిబ్బంది వందో.. రెండు వందలో అడిగితే దాన్ని లంచంగా పరిగణించవద్దని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. మరి ఆ వందో.. రెండు వందలో ఉంటే తాము ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తామని, ప్రభుత్వ ఆస్పత్రులకు ఎందుకు వస్తామన్నది రోగుల ప్రశ్న. ఇక ప్రభుత్వ సిబ్బంది లంచాలు తీసుకోవద్దని చెప్పాల్సిందిపోయి.. వందో.. రెండు వందలో అంటూ రాజయ్య వెనకేసుకురావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలోనే ఓసారి రాజయ్యను కేసీఆర్ సభావేదికమీదే హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చీవాట్లు పెట్టారు. అయినా రాజయ్య శైలి మాత్రం మారడం లేదు.