నంది అవార్డులపై ఎటూ తేలడం లేదు. రాష్ట్ర విభజనతో నంది అవార్డులు ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తుందా..? లేక తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుందా..? లేక రెండు రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా ఇస్తాయా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకటే అయిన రెండు రాష్ట్రాల్లో విస్తరించినందునా వేర్వేరుగా అవార్డులు ప్రకటించినా పర్వలేదు అని కొందరు సినీ పెద్దలు చెబుతున్నారు. అదే సమయంలో మరికొందరు ఇండస్ట్రీ ఒకటే అయినప్పుడు వేర్వేరుగా అవార్డులు ప్రకటించాల్సిన అవసరం లేదని, రెండు రాష్ట్రాలు కలిసి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి అవార్డులు ప్రకటిస్తే సరిపోతుందని మాట్లాడుతున్నారు. కాని సంయుక్త కమిటీలో ఏకాభిప్రాయం రావడం అంతసులభం కాదని, ప్రాంతాలనుబట్టి ప్రాధాన్యతలు మారిపోతాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా అవార్డులు ప్రకటించాలన్న యోచనలో ఉంది. కాగా గత మూడేళ్లకు సంబంధించి మాత్రం రెండు రాష్ట్రాలు సంయుక్తంగా అవార్డు ప్రకటిస్తే బాగుంటుందని, భవిష్యత్తులో ఎవరికి వారు అవార్డులు ప్రకటించినా పర్వలేదనే వాదనలు వినబడుతున్నాయి.