తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవల బల్గేరియాలో కూడా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలోని పాల సముద్రం, నార్త్ సిటీ, బీఎస్ఎఫ్ షెడ్లు, విలేజ్ స్ట్రీట్ లో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీటిలో ప్రభాస్ తో పాటు కీలకపాత్రదారులు పాల్గొంటున్నారు. కాగా ఇటీవల విడుదల చేసిన 'విజువలైజింగ్ ది వరల్డ్ ఆఫ్ బాహుబలి' వీడియోకు వచ్చిన స్పందన పట్ల యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ లో మొదటి భాగం విడుదలకానుంది.