Advertisement
Google Ads BL

గణేష్‌పాత్రో వంటి గొప్ప రచయిత ఇక రారు.!


ఎన్ని మంచి సినిమాలు వచ్చినా వాటిలో మనం మాట్లాడుకునేది కొన్ని సినిమాల గురించే. ఇది సినిమా రంగంలోని అన్ని శాఖలకూ వర్తిస్తుంది. రచయితల విషయానికి వస్తే 80 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎంతో మంది రచయితలు ఎన్నో మంచి చిత్రాలకు రచనలు చేశారు. వారిలో కొంతమంది గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అలాంటివారిలో ప్రముఖ రచయిత గణేష్‌ పాత్రో ఒకరు. 1980 దశకంలో రచయితగా ఓ వెలుగు వెలిగిన పాత్రో సామాజిక స్పృహ వున్న ఎన్నో ఉత్తమ చిత్రాలకు రచన చేశారు. సగటు మనిషి, మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో ఎన్నో మంచి సినిమాలను రూపొందించిన దివంగత కె.బాలచందర్‌కు పాత్రో అత్యంత సన్నిహితుడుగా చెప్పుకోవాలి. ఆయనతో కలిసి మరోచరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, రుద్రవీణ వంటి చిత్రాలకు మాటలు రాసారు. బాలచందర్‌ ఊహలకు ఆలోచింపజేసే మాటలు రాయడం ద్వారా దర్శకుడుగా బాలచందర్‌కి ఎంత మంచి పేరు వచ్చిందో గణేష్‌పాత్రోకి కూడా అదే స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. బాలచందర్‌తోనే కాకుండా ప్రముఖ దర్శకులు చేసిన ఇతర చిత్రాలకు కూడా మాటలు రాశారు పాత్రో. సీతారామయ్యగారి మనవరాలు, తలంబ్రాలు, మనిషికో చరిత్ర, మయూరి వంటి ఎన్నో మంచి సినిమాలకు రచన చేశారు.  దర్శకుడు కె.బాలచందర్‌ చనిపోయిన 12 రోజుల తర్వాత గణేష్‌పాత్రో కూడా చిత్ర పరిశ్రమని దు:ఖ సాగరంలో ముంచి వెళ్ళిపోవడం అందర్నీ కలచివేసింది. జూన్‌ 22, 1945లో విజయనగరం దగ్గరలోని పార్వతీపురంలో జన్మించిన గణేష్‌పాత్రో  1965లో నాటక రచయితగా తన కెరీర్‌ని ప్రారంభించి 1970 నుంచి 1990 వరకు 100కి పైగా చిత్రాలకు రచన చేశారు. సినిమా రచనకు దాదాపు 15 సంవత్సరాలు దూరంగా వున్న పాత్రో మాటలు రాసిన చివరి సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్‌ అడ్డాలతో కలిసి ఆ సినిమాకి మాటలు అందించారు పాత్రో. రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి వున్న గణేష్‌ పాత్రోలాంటి రచయిత ఇక రారేమో అనిపిస్తుంది. గొప్ప రచయిత కావాలనుకునేవారికి  ఆయన రాసిన సినిమాల్లోని మాటలు గొప్ప స్ఫూర్తినిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్ర పరిశ్రమలో ఎవరు చనిపోయినా పరిశ్రమకు తీరని లోటు అని చెప్తుంటాం. కానీ, గణేష్‌పాత్రో లాంటి రచయితను కోల్పోవడం నిజంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు. గణేష్‌పాత్రో మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పిస్తోంది ‘సినీజోష్‌’. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs