సంక్రాంతి సెలవులకు సంబంధించి టీ-సర్కారు వ్యవహారతీరుపై ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధం లేని క్రిస్మస్, జనవరి1కి సెలవులు ప్రకటిస్తూ సంక్రాంతికి సెలవులు కుదించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతికి పాఠశాలలకు కనీసం 8 రోజుల సెలవులిస్తారు. అయితే ఈసారి మాత్రం ఆ సెలవులను 10 నుంచి 14వ తేదీ వరకు కుదించారు. ఇందులో 10వ తేదీ రెండో శనివారం కాగా, 11వ తేదీ ఆదివారం. దీన్నిబట్టి టీ-సర్కారు విద్యార్థులకు కేవలం మూడు రోజుల సెలవులు మాత్రమే ఇచ్చింది. అంతేకాకుండా పండుగ మూడో రోజును కనుమ పండుగనాడు 15వ తేదీన పాఠశాలలను రీఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్నిబట్టి పండుగకు గ్రామాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థులు 14వ తేదీనే అంటే పండుగ రోజే తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా ప్రాంతీయ విభేదాలతో తమను పండుగలకు దూరం చేయడం భావ్యం కాదని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కేవలం ఆంధ్రకే పరిమితం కాలేదని, తెలంగాణలో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారని వారు వాదిస్తున్నారు. కనీసం జనవరి 15వరకు సెలవులు పొడగించి తమను కనుమ పండుగకు దూరం కాకుండా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.