సినిమా అనేది కూడా కళాత్మకమైన వ్యాపారం అని అందరూ అంగీకరించే అంశం. ఏ వ్యాపారమైనా ఆయా హీరోల మార్కెట్ ను అనుగుణంగా, ఏయే హీరోలపై ఎంత పెట్టుబడి పెడితే సేఫ్ గా బయటపడగలమనే అంశంపై ఆధారపడి ఉంటుంది. కానీ నేటి దర్శకులు మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా తమకు దొరికిన అవకాశాలను కాపాడుకొనే ఉద్దేశ్యంతో కొత్త హీరోలపై కూడా కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టించి ఆయా చిత్ర నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నారు. భారీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అతని మొదటి సినిమా 'అల్లుడు శీను'కు స్టార్ హీరోల రేంజ్ లో ఖర్చు పెట్టించాడు. వాస్తవానికి పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం దాదాపు 20కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే నిర్మాత చేత భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టించడంతో ఈ చిత్రం నిర్మాతకు భారీ నష్టాలనే మిగిల్చింది. అయితే ఇక ఫేడవుట్ అయిన దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డికి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన అవకాశం 'యమలీల 2'. సతీష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ చిత్రానికి అవకాశం సంపాదించిన ఎస్.వి.కృష్ణారెడ్డి 'యమలీల2'కు భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టించాడు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం నిర్మాత కమ్ హీరోకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇలాగే నిర్మాత సాయిబాబా తనయుడు హీరోగా రూపొందిన 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం బిజినెస్ కాకపోవడంతో విడుదలకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మన దర్శకులు తమ భారీతనం కోసం నిర్మాతల చేత విచ్చలవిడిగా ఖర్చు చేయిస్తూ నిర్మాతలను నిలువునా ముంచుతున్నారని.. అదే సమయంలో నిర్మాతలు సైతం గుడ్డిగా వారిని ఫాలో అవుతున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.