భారీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా తెరంగేట్రం చేసి, మొదటి చిత్రంలోనే వి.వి.వినాయక్, సమంత, తమన్నా వంటి వారితో కలిసి పని చేసే అవకాశం దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెండో చిత్రం మాత్రం ఇబ్బందుల్లో పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించాల్సిన చిత్రం ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. దీంతో ఇంతకాలం మరో చిత్రం కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్ కు ఇప్పుడు రెండో చిత్రం అవకాశం వచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. గత రెండు సంవత్సరాలుగా రవితేజ చేస్తాడు.. సునీల్ చేస్తాడు.. అంటూ తమిళ హిట్ 'సుందరపాండ్యన్' రీమేక్ వార్తల్లో నలుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రీమేక్ కు బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందనుందని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి 'సుందర్ అండ్ కో' అనే టైటిల్ ను కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బెల్లంకొండ సురేష్ తో చర్చలు జరిగాయని, హిట్ రీమేక్ కాబట్టి ఆయన కూడా వెంటనే అంగీకరించాడని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలుగులో రీమేక్ సినిమాలు తీయడంలో పెట్టింది పేరైన భీమనేని ఇది వరకు తీసిన పలు రీమేక్ లను హిట్స్ గా మలిచాడు. నరేష్ తో చేసిన 'సుడిగాడు' చిత్రం సూపర్ హిట్ అయింది. తాజాగా 'సుందర పాండ్యన్' చిత్రాన్ని ఆయన రీమేక్ చేయనున్నాడు.